: విజయసాయి ఏకగ్రీవం... అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి వైకాపా తరఫున పోటీ పడ్డ విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత, నాలుగు సీట్లకు గాను నలుగురే అభ్యర్థులు మిగలడంతో, వారంతా ఎన్నికయ్యారని చెప్పి, ధ్రువపత్రాలను అందించారు. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిలు పలువురు తెలుగుదేశం మంత్రులతో కలిసి వచ్చి ధ్రువపత్రాలను అందుకోగా, విజయసాయి రెడ్డి మాత్రం హాజరు కాలేదు. గెలిచినట్టు సర్టిఫికెట్ అందుకున్న తరువాత సురేష్ ప్రభు మాట్లాడుతూ, ఏపీ ప్రజలకు తనకు చేతనైనంత సేవ చేస్తానని చెప్పారు. కాగా, వ్యక్తిగత కారణాలతోనే విజయసాయి హాజరు కాలేదని, సాయంత్రం లేదా రేపు అసెంబ్లీకి వచ్చి ఆయన ధ్రువపత్రాన్ని స్వీకరిస్తారని తెలుస్తోంది.