: ఢిల్లీలో కిడ్నీ రాకెట్ కలకలం!... ఇద్దరు అపోలో సిబ్బంది సహా ఆరుగురి అరెస్ట్!


తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపేసిన కిడ్నీ రాకెట్ దేశ రాజధాని ఢిల్లీకీ పాకింది. ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కిడ్నీ రాకెట్ పై దర్యాప్తుకు దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ప్రైవేటు వైద్య రంగంలో అగ్రగామిగా ఎదిగిన అపోలో ఆసుపత్రికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఉత్తర భారతంలో పేద ప్రజలు, వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని రంగంలోకి దిగిన కిడ్నీ రాకెట్ ముఠా అపోలో ఆసుపత్రి సహా పలు ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని కిడ్నీల విక్రయాన్ని కొనసాగిస్తోంది. వీరి బుట్టలో పడ్డ ఓ వ్యక్తి తన భార్య కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ అమ్మగా వచ్చిన సొమ్ము విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో ఈ వ్యవహారం నగరంలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ కు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి కిడ్నీ రాకెట్ ను నిర్వహిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అపోలో ఆసుపత్రి సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. ఇక ముఠాకు, కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులతో పాటు ముగ్గురు కిడ్నీ దాతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇప్పటికే ఈ ముఠా నాలుగు కిడ్నీలను అమ్మేసినట్లు తేలింది. ఈ వ్యవహారం దేశ రాజధానిలో కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News