: కేసీఆర్ మాటల వెనకున్న అసలు మతలబు ఇదే: షబ్బీర్ అలీ
వచ్చే సంవత్సరం కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వానికి 2019 వరకూ సమయం ఉండగా, తానిచ్చిన హామీలను 2022 నాటికి నెరవేరుస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ప్రస్తావించిన షబ్బీర్, ఈ వ్యాఖ్యల వెనుక మధ్యంతరానికి వెళ్లాలన్న ఆలోచన ఉందని అభిప్రాయపడ్డారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, 2019లోగా హామీలను తీర్చకుండా, 2022 నాటికి అంటూ పొడిగించడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫిరాయించి, టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందని వివరించారు.