: భారత్లో 18 శాతం మంది చిన్నారులకే డీటీపీ వ్యాక్సిన్.. పరిశోధకుల వెల్లడి
భారత్లో 18 శాతం మంది చిన్నారులకే సరైన మోతాదులో డీటీపీ వ్యాక్సిన్ అందుతోందని అమెరికాలోని మిచిగాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే భారత్లో జననాల సంఖ్య అధికంగా ఉందని చెప్పారు. ప్రతీ ఏడాది దేశంలో 26 మిలియన్ల మంది పుడుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే వారికి సకాలంలో వ్యాక్సిన్లు లభించడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు వేయించకపోవడం వల్ల దేశంలో అత్యధికంగా చిన్నారులు మృతి చెందుతున్నారని వెల్లడించారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు చిన్నారులకు సకాలంలో వ్యాక్సిన్లు అందడం లేదని, చిన్నారుల మరణాలకు కారణమవుతోన్న వాటిలో వ్యాక్సిన్ అందక చనిపోతోన్న చిన్నారులే అధికంగా ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఐదేళ్ల వయసులోపే సంభవిస్తోన్న పిల్లల మరణాల్లో వ్యాక్సిన్ లభించని కారణంగా చనిపోతున్న చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో ముందు వరసలో ఉన్న భారత్లో ఈ పరిస్థితి రావడం గమనార్హం.