: అనారోగ్యమన్న సాయిరెడ్డి!... ఆగ్రహం వ్యక్తం చేసిన సీబీఐ కోర్టు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సందర్భంగా కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ పై నమోదైన అన్ని కేసుల విచారణను వేగిరం చేసిన సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం ఈ కేసును విచారిస్తోంది. ఈ క్రమంలో నిందితులంతా ప్రతి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలలో విచారణకు పలుసార్లు హాజరైన వైఎస్ జగన్... ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తాను ప్రతివారం విచారణకు రావాలంటే కుదరదని కోర్టుకు విన్నవించారు. జగన్ అభ్యర్థనను మన్నించిన కోర్టు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేసులో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నేటి విచారణ సందర్భంగా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అయితే కోర్టు ఆగ్రహాన్ని కాస్తంత ముందుగానే పసిగట్టిన సాయిరెడ్డి... అనారోగ్యం కారణంగానే తాను విచారణకు హాజరుకాలేకపోయానని, తనను మన్నించాలని వేడుకుంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్ ను కొట్టివేశారు. కేసు విచారణ హాజరుకు మినహా, ఇతర కార్యకలాపాల్లో చురుకుగానే పాలుపంచుకుంటున్న సాయిరెడ్డి అనారోగ్యమని చెప్పడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే సాయిరెడ్డి పిటిషన్ ను కొట్టేసిన న్యాయమూర్తి ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. కోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఈ నెల 10న జరగనున్న తదుపరి విచారణకు సాయిరెడ్డి తప్పనిసరిగా హాజరవుతారన్న వాదన వినిపిస్తోంది.