: మధుర అల్లర్లలో 19కి చేరిన మృతులు... 200 మందికి పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్ లో నిన్న సాయంత్రం చోటుచేసుకున్న అల్లర్లు మరింత మేర పెచ్చరిల్లాయి. భూ ఆక్రమణలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వందలాది మంది స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అయినా వెనక్కు తగ్గని స్థానికులు పోలీసులతో పెద్ద యుద్ధానికే దిగారు. ఈ ఘర్షణల్లో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు ఓ సీఐ స్థాయి అధికారి కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు 12 మంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఘర్షణల్లో తీవ్రంగా గాయపడ్డ దాదాపు 200 మందిని పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారు. దీంతో ఈ ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి.