: జగన్ రైతు భరోసా యాత్రకు బ్రేకులేనా?... యాత్రను అడ్డుకోవాలని పెనుకొండ ఎమ్మెల్యే పిలుపు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగలడం ఖాయంగానే కనిపిస్తోంది. రైతు భరోసా యాత్ర పేరిట జగన్ అనంతపురం జిల్లాలో చేపట్టిన యాత్ర నేటికి మూడో రోజుకు చేరుకోనుంది. నిన్న తాడిపత్రి పరిధిలోని పెద్ద వడుగూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవినీతి చంద్రబాబును చెప్పులతో కొడితే కాని బుద్ధి రాదని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జగన్ వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారధి... జగన్ పర్యటనను అడ్డుకోవాలని నేటి ఉదయం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పార్థసారధి పిలుపుతో రోడ్డుపైకి రానున్న టీడీపీ శ్రేణులు జగన్ పర్యటనను అడ్డుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితిని అంచనా వేస్తున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యల కింద భారీ సంఖ్యలో బలగాలను రంగంలోకి దించారు.

  • Loading...

More Telugu News