: వారం రోజుల జపాన్ శ్రమకు ఫలితం... చిట్టడవిలో తల్లిదండ్రులు వదిలి వెళ్లిన బాలుడు క్షేమం
దాదాపు వారం రోజుల క్రితం జపాన్ అడవుల్లో తప్పిపోయిన ఏడేళ్ల బాలుడు యమాటో తనూకా క్షేమంగానే ఉన్నాడని అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు బాలుడిని ప్రాణాలతో కనుగొన్నామని, అతనికి ఎటువంటి గాయాలూ లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు. పక్కనున్నవారిపై రాళ్లేశాడన్న కోపంతో యమాటోను తల్లిదండ్రులు ఎలుగుబంట్లు అధికంగా ఉండే అడవిలో వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. అడవిలో పర్యటిస్తున్న స్వీయ రక్షణ దళ అధికారికి బాలుడు కంటబడ్డాడని, ఆ వెంటనే మెడికల్ హెలికాప్టర్ ద్వారా బాలుడిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. గత శనివారం నాడు బాలుడిని అతని తల్లిదండ్రులే అడవిలో వదిలి వెళ్లారు. ఈ వారం రోజులూ అన్నపానీయాలు లేకుండా యమాటో అడవిలో గడిపినట్టు అధికారులు భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన జపాన్ ప్రభుత్వం వందలాది మందితో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పుడు బాలుడు ప్రాణాలతో దొరకడంతో, అధికారుల చొరవకు ప్రశంసలు దక్కుతున్నాయి.