: నాడు రాళ్లతో, నేడు చెప్పులతో కొట్టమంటున్నావు!... ఇదేం సభ్యత?: జగన్ పై ధ్వజమెత్తిన పల్లె
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని పెద్ద వడుగూరులో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘురాథరెడ్డి వెనువెంటనే స్పందించారు. ‘‘నీ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చి వేలాది ఎకరాల పంటలను కాపాడి రైతులను ఆదుకున్నది నీ కంటికి కనబడదా? ఒకసారి రాళ్లతో కొట్టమన్నావు. ఇంకోసారి తునిలో విధ్వంసం సృష్టించావు. ఇప్పుడు చెప్పులతో కొట్టమంటున్నావు. ఇది నీ క్రిమినల్ మనస్తత్వానికి, రక్త చరిత్రకు పరాకాష్ట. మీ తాత రాజారెడ్డి వారసత్వం నిలబెట్టుకుంటున్నావా? ఎవర్ని చెప్పులతో కొట్టాలో 2014లో ప్రజలు కొట్టి చూపారు. తిరిగి 2019లో కొట్టి చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ సభ్యత, సంస్కారం లేకుండా అహంకారంతో కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు’’ అని పల్లె ఆగ్రహం వ్యక్తం చేశారు.