: మధురలో చెలరేగిన హింస!.. ఎస్పీ సహా 14 మంది దుర్మరణం!
ఉత్తరప్రదేశ్ లోని మధురలో నిన్న రాత్రి చెలరేగిన హింసలో ఓ ఎస్పీ స్థాయి అధికారి సహా 14 మంది చనిపోయారు. పట్టణంలోని భూ దురాక్రమణలను తొలగించాలన్న అలహాబాదు హైకోర్టు తీర్పు కాపీని పట్టుకుని రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. వేలాదిగా తరలివచ్చిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు తేరుకునేలోగానే నష్టం జరిగిపోయింది. జనం దాడిలో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు నగరంలోని ఫరా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ సంతోష్ కుమార్, మరో 12 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో సగం మంది పోలీసులే ఉండటం గమనార్హం. స్థానికుల మూకుమ్మడి దాడితో కాస్తంత ఆలస్యంగా తేరుకున్న పోలీసులు ఆ తర్వాత పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం మధురలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.