: రూ.5 కోట్లిస్తామంటే ఓటేస్తాం!... ‘స్టింగ్’లో అడ్డంగా బుక్కైన కర్ణాటక ఎమ్మెల్యేలు!


రాజ్యసభ ఖాళీలకు జరుగుతున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగుస్తున్న తరుణంలో కర్ణాటకలో మాత్రం కలకలం రేపుతున్నాయి. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పోలింగ్ తప్పని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఎంతమేర ముడుపులు చెల్లించేందుకైనా వెనుకాడటం లేదు. ఇదే అదనుగా ఎమ్మెల్యేలు కూడా తమ ఓటుకు ఆకాశాన్నంటే ధరను ప్రకటిస్తున్నారు. ‘‘రూ.5 కోట్లిస్తామంటే చెప్పండి, మా ఓటు మీకే’’ అంటూ ఎమ్మెల్యేలు ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన రాజ్యసభ అభ్యర్థులకు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ లోకల్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్కయ్యారు. రూ.5 కోట్లిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయడానికి తాము సిద్ధమేనంటూ స్టింగ్ కెమెరాకు చిక్కిన ఆ ఎమ్మెల్యేల్లో... ఇద్దరు జేడీఎస్ కు చెందిన వారు కాగా, కేజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే, స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు. ఈ స్టింగ్ వీడియో ప్రస్తుతం కన్నడనాట కలకలం రేపుతోంది. దీని ఫలితంగా ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసే దిశగా యోచిస్తోంది.

  • Loading...

More Telugu News