: చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు!... ‘అనంత’లో కలకలం రేపిన విపక్ష నేత కామెంట్లు!
రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు జగన్ పై నిప్పులు చెరిగాయి. ఓ చోట టీడీపీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వెరసి అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... రైతు భరోసా యాత్రలో భాగంగా నిన్న తాడిపత్రి పరిధిలోని పెద్ద వడుగూరులో పర్యటించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. చెప్పుతో కొడితే తప్ప చంద్రబాబుకు బుద్ధి రాదని కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు చెప్పింది జరగాలంటే ప్రజలు చేయాల్సింది ఒక్కటే. ఎక్కడ కనిపిస్తే అక్కడ అవినీతి చంద్రబాబును చెప్పుతో కొట్టడమే. అప్పుడు తప్ప ఆయనకు బుద్ధి రాదు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. అమరావతి పరిధిలో భూములను పెట్టుబడిదారులకు తక్కువ ధరకు కట్టబెట్టారని, అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయన ఆరోపించారు. తన పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని జగన్ ధ్వజమెత్తారు. పెను కలకలం రేపిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు వేగంగా స్పందించారు.