: మహారాష్ట్ర సచివాలయం కంప్యూటర్లకు వైరస్... ప్రైవేటు మెయిల్ సర్వీస్ వాడద్దని ఉద్యోగులకు ఆదేశాలు
మహారాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లకు వైరస్ సోకింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇకపై మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఈ-మెయిల్ అకౌంట్ల వాడకం మానేయాలని సూచించింది. మహారాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో 150 కంప్యూటర్లు లాకీ వైరస్ బారిన పడ్డాయి. ఈ 150 కంప్యూటర్లలో ఎక్కువ రెవెన్యూ, పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ లకు చెందినవి అధికంగా ఉన్నాయి. దీంతో అధికారులు ఆందోళనలో మునిగిపోయారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ కంప్యూటర్లను ఫొరెన్సిక్ టెస్టు కోసం ల్యాబ్ కు పంపించారు. వెంటనే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులతో సమావేశమైన సీఎం ఇలాంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు. అధికారుల్లో ఎక్కువ మంది జీమెయిల్, యాహూ లాంటి మెయిల్స్ వాడుతున్నారని, వాటిని మానేసి ప్రభుత్వ అధికారిక మెయిల్ సర్వీసును వినియోగించుకోవాలని సూచించారు. దీంతో ఇకపై సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు మెయిల్స్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు తక్షణం కీలకమైన ఫైల్స్ ను ప్రభుత్వ మెయిల్ సర్వీసుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని సూచించారు.