: వెయ్యికాళ్ల మండపం జోలికి వెళ్లిన వారు చాలా ఇబ్బందిపడ్డారు... మళ్లీ తెరపైకి తేవద్దు: విశాఖ శారదా పీఠాధిపతి
తిరుమలలోని వెయ్యికాళ్ల మండపం అంశాన్ని మళ్లీ తెరపైకి తేవద్దని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి జోలికి వెళ్లి చాలా ఇబ్బందులు పడ్డారని, ఆ తర్వాత ఇదే అంశంపై మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల గురించి కూడా స్వరూపానంద ప్రస్తావించారు. గతంలో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు, పీఠాధిపతులను, మఠాధిపతులను ఏపీ సర్కార్ సంప్రదించలేదని... అభాసు పాలైందని, ఇప్పుడు కూడా అభాసుపాలు కావాలని ప్రభుత్వం అనుకుంటోందేమోనని అన్నారు. ‘ముఖ్యంగా ఏమిటంటే, కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయ భూములు, సత్రం భూములు చాలా ఘోరంగా కబ్జాకు గురవుతున్నాయి. మరోవైపు ఆ భూములను అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారు. చెన్నైలోని ‘సదావర్తి’ సత్రం వెయ్యికోట్ల ఆస్తి. ఈ సత్రానికి ఉన్న నాలుగు వందల డెబ్భై ఒక్క ఎకరాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దలకు పూర్తిగా అమ్మాకానికి పెట్టింది. ఇప్పుడు 83 ఎకరాలు మిగిలింది. ఆ ఎనభై మూడు ఎకరాలను కూడా మిగల్చకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖతో టై అప్ అయింది. అధికారులతో పూర్తిగా కుమ్మక్కైంది’ అని స్వరూపానందేంద్ర ఆరోపించారు.