: అప్పారావు ఎక్కడికీ వెళ్లడు... ఫోన్ కాల్స్ పై వాస్తవం విచారణలో తేలుతుంది: అశోక్ గజపతిరాజు
తన వద్ద ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న అప్పారావుపై తనకు నమ్మకం ఉందని, ఆయన్ను తొలగించేది లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, విచారణ జరిగిన తరువాతనే నిజానిజాలు తేలుతాయని అన్నారు. ఆయుధాల వ్యాపారి, వాద్రాకు లండన్ లో ఇంటిని లంచంగా ఇచ్చారన్న ఆరోపణలు వచ్చిన సంజయ్ భండారీ, అప్పారావుతో వందలసార్లు ఫోన్లో మాట్లాడారని, తనను కలిశారని వచ్చిన వార్తలపై ఆయన మీడియాతో మాట్లాడారు. భండారీని కలిసినట్టు వచ్చిన వార్తలు నిజమేనని ఇప్పటికే మీడియాకు వెల్లడించానని గుర్తు చేసిన ఆయన, అప్పారావుకు ఫోన్ కాల్స్ విషయంలో విచారణ జరపాలని కోరినట్టు తెలిపారు. ఆయన్ను తాను రక్షించడం లేదని, ఇదే సమయంలో నమ్మినంత కాలం పక్కనే ఉంచుకుంటానని తెలిపారు. ఆయనపై ఫోన్ కాల్స్ ఆరోపణలు తప్ప మరే ఇతర ఆరోపణలు లేవని తెలిపారు. కాగా, అశోక్ గజపతిరాజు తన కార్యాలయంలోకి మీడియాను పిలిపించుకుని మాట్లాడితే, ఆ సమయంలో అప్పారావు అక్కడికి రాకపోవడం, ఆయన ఫోన్లోనూ అందుబాటులో లేకపోవడం గమనార్హం.