: ట్రంప్ 'బిజినెస్' నిర్వాకాన్ని కోర్టు ముందు బయటపెట్టిన ఉద్యోగులు
అమెరికా అధ్యక్షబరిలో నిలబడ్డ డొనాల్డ్ ట్రంప్ మీడియాపై నోరు పారేసుకుంటుండడంతో ఇంతకాలం బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలు బట్టబయలవుతున్నాయి. రియల్ బూమ్ జోరుగా ఉన్న 2005లో ఫర్ ప్రాఫిట్ స్కూల్ పేరిట ట్రంప్ ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు. ఈ యూనివర్సిటీలో జరిగినన్ని అవకతవకలు ప్రపంచంలోని ఏ యూనివర్సిటీలోనూ జరిగి ఉండవని అమెరికన్ మీడియా తెలిపింది. యూనివర్సిటీలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో విచారించిన న్యాయస్ధానం యూనివర్సిటీ ఉద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ సిబ్బంది న్యాయస్థానానికి దిగ్బ్రాంతి కలిగించే వాస్తవాలు వెల్లడించారు. యూనివర్సిటీలో తరగతులు చెప్పాలంటే ఉండాల్సింది విద్యార్హతలు కాదని, పరపతి అని, వ్యాపారం చేయడం వచ్చు అని ట్రంప్ కు అనిపిస్తే చాలు, యూనివర్సిటీలో అధ్యాపకులుగా విధులు నిర్వర్తించవచ్చని వారు తెలిపారు. జ్యుయలరీ షాపులో పని చేసే వ్యక్తి ఈ యూనివర్సిటీలో తరగతులు నిర్వహిస్తున్నాడని వారు న్యాయస్ధానం ముందు వాపోయారు. అతని నియామాకాన్ని తప్పుపట్టినందుకు ట్రంప్ తో తిట్లుతినాల్సి వచ్చిందని ఓ అధ్యాపకుడు తెలిపారు. అతి తక్కువ కాలంలో కోట్లాది రూపాయలు సంపాదించేందుకు చిట్కాలు నేర్పుతానని, ప్రపంచంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్ ప్రారంభిస్తానని చెప్పుకున్న ట్రంప్, యూనివర్సిటీకి మేనేజర్ గా వ్యవహరించాల్సిందిపోయి, యూనివర్సిటీ ప్రమోటర్ గా వ్యవహరించాడాని ఆ యూనివర్సిటీ మాజీ మేనేజర్ ష్నాకెన్ బర్గ్ తెలిపారు. ఓ విద్యార్ధి ఫీజులు కట్టలేని స్ధితిలో ఉండడం చూసి, ఫీజుల విషయంలో తాను పట్టించుకోలేదని, దీనికి ట్రంప్ నుంచి చెవులు చిల్లులుపడేలా తిట్లు తిన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ యూనివర్సిటీలో చదవాలన్నా కూడా ఎలాంటి విద్యార్హత అవసరం లేదని, ఉండాల్సిందంతా ఫీజులు చెల్లించే స్తోమత అని వారు తెలిపారు. ఫీజులు కట్టలేని విద్యార్ధులను వివిధ బ్యాంకుల్లో క్రెడిట్ కార్డులు తీసుకుని, వాటి సాయంతో ఫీజులు చెల్లించాలని ట్రంప్ సూచించేవాడని ఆయన న్యాయస్ధానానికి తెలిపారు.