: ఓలాను వెనక్కు నెట్టేందుకు వేల కోట్లు కేటాయించిన ఉబెర్!


యాప్ ఆధారిత టాక్సీ సేవలందిస్తున్న భారత సంస్థ ఉబెర్, తమకు ప్రధాన పోటీగా ఉన్న ఓలాను వెనక్కు నెట్టేందుకు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. సంస్థ సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ నుంచి సేకరించిన 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23 వేల కోట్లు)లో 1 నుంచి 1.2 బిలియన్ డాలర్లను (రూ. 6,600 కోట్ల నుంచి రూ. 7,900 కోట్లు) మార్కెట్ ఆధిపత్యం కోసం ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయించినట్టు రీసెర్చ్ సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఓలాకు భారత క్యాబ్ మార్కెట్లో 60 నుంచి 65 శాతం వాటా ఉండగా, తాజాగా విస్తరిస్తున్న ఉబెర్ కు 35 నుంచి 40 శాతం మార్కెట్ వాటా ఉంది. "సౌదీ నుంచి సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని భారత మార్కెట్లో వెచ్చిస్తాం" అని వెల్లడించిన ఉబెర్ ప్రతినిధి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియజేయలేదు. 2013లో భారత మార్కెట్లోకి లగ్జరీ కార్లను టాక్సీలుగా తిప్పే సంస్థగా ప్రవేశించిన ఉబెర్, ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 నగరాల్లో అన్ని రకాల కార్లను క్యాబ్ లుగా తిప్పుతూ విస్తరించింది. ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, ముందడుగు వేయాలన్నదే సంస్థ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 వేల కోట్లు) భారత మార్కెట్లో ఖర్చు చేసిన ఓలా సైతం మరో 1.3 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 8.5 వేల కోట్లు) వెచ్చించి అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఏప్రిల్ వరకూ గణాంకాలను పరిశీలిస్తే, ఉబెర్ కన్నా ఓలా రెండు రెట్లు అధిక వాటాను కలిగివుందని ట్రూకాలర్ నివేదిక వెల్లడించింది. మొత్తం 10 కోట్లకు పైగా ఓలా క్యాబ్ లు బుక్ కాగా, ఉబెర్ దాదాపు 4 కోట్ల బుకింగ్స్ తో సరిపెట్టుకుంది. ఇక ఉబెర్ తాజా పెట్టుబడులతో ఏ మేరకు ఓలాను దెబ్బకొడుతుందన్నది మార్కెట్ వర్గాలకు ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News