: దొంగ టికెట్ తో ఢిల్లీ ఎయిర్ పోర్టులో పది రోజులు మకాం వేసిన హైదరాబాదీ... పెరిగిన చొరబాట్లతో భద్రతపై తీవ్ర ఆందోళన!


ఢిల్లీ విమానాశ్రయంలోకి తప్పుడు టికెట్ తో వెళ్లిన ఓ వ్యక్తి, పది రోజుల పాటు అంతర్జాతీయ టెర్మినల్ లో మకాం వేయగా, ఎయిర్ పోర్టు ఉద్యోగులు, భద్రతా సిబ్బంది అతనిని గుర్తించలేదు. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్లా యూఏఈకి వెళ్లడానికి ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు చెందిన తప్పుడు టికెట్ తీసుకుని వెళ్లాడు. ఈ ఘటన ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు సరిగ్గా వారం ముందు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ తరహా ఘటనలు కొత్తేమీ కాదు. ఎయిర్ పోర్టులోకి సులువుగా ప్రవేశిస్తున్న వ్యక్తులు ఆపై ఏం చేస్తున్నారన్న విషయమై నిఘా కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక మార్చిలో ఓ యువకుడు ఫిస్టల్ తో ఎయిర్ పోర్టులోకి వెళ్లగా, గత నెలలో ఇంటర్నేషనల్ టెర్మినల్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో తన గర్ల్ ఫ్రెండ్ ను చూసేందుకంటూ, తప్పుడు టికెట్ తో విమానాశ్రయంలోకి ప్రవేశించిన విదేశీయుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015లో 20కి పైగా కేసులు నమోదు కాగా, 50 మంది పట్టుబడ్డారు. ఈ సంవత్సరం పాతిక మంది వరకూ దొరికిపోయారు. "ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి ఎంతో మంది విదేశీ టూరిస్టులు, దేశీయ ప్రయాణికులు వస్తుంటారు. సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎన్నో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ తరహా ఘటనలు జరుగకుండా చూడాల్సివుంది" అని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News