: తలుపులు మూసి... సీసీ టీవీలు కట్టేసి.. బిల్లును ఆమోదించారు!: నాటి రోజుల్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటులో లభించిన ఆమోదంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అసంబద్ధంగా విభజిస్తున్నారని పరుగు పరుగున తాము ఢిల్లీ వెళ్లామని, తాము ఢిల్లీలో ఉండగానే విభజన జరిగిపోయిందని ఆయన చెప్పారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు... ఆ తర్వాత ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. హడావిడిగా జరుగుతున్న రాష్ట్ర విభజనను అడ్డుకునే క్రమంలో తాను పార్లమెంటు ఆవరణలోకి వెళ్లానని చంద్రబాబు చెప్పారు. నాడు విపక్షంలోని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఎల్కే అద్వానీని పార్లమెంటు ఆవరణలోని ఆయన చాంబర్ లో కలిశామని తెలిపారు. తాము అద్వానీతో చర్చిస్తుండగానే విభజన బిల్లుకు ఆమోదం లభించేసిందన్నారు. విభజన బిల్లుకు ఆమోదం లభించిన తీరు దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తలుపులు మూసి... సీసీ టీవీలు ఆపేసి... అరగంటలో బిల్లుకు ఆమోదం తెలిపారు’’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.