: మేము అధికారంలోకి రాగానే టీఎస్ ను టీజీగా మారుస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోన్న పలు నిర్ణయాలపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఇంతకు ముందు టీజీ అనే సంక్షిప్త అక్షరాలతోనే పాప్యులర్ అయిందని, కానీ టీజీని టీఎస్ గా మార్చేశారని ఆయన అన్నారు. టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, అనంతరం తాము టీఎస్ ని ఇంతకు ముందు ఉన్నట్లుగానే టీజీగా మారుస్తామని అన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరులైన కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అమరుల కుటుంబాలకు న్యాయం కోరుతూ ఓయూలో విద్యార్థులు ఈరోజు ఆందోళన చేపట్టారని అన్నారు. ఓయూలో పర్యటించి తాను అమరుల కుటుంబాలను సన్మానించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఓయూ విద్యార్థులతో తాను మాట్లాడిన మాటలను, టీఆర్ఎస్ ఫోన్లను ట్యాప్ చేసి తెలుసుకుందని ఆయన ఆరోపించారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.