: ‘రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు’ అంశంపై బీజేపీ నేతల విసుర్లు!
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధినేతగా చేయనున్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చలు తీవ్రతరమవుతోన్న క్రమంలో పలువురు బీజేపీ మంత్రులు, నేతలు ఈ విషయంపై తమదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై చురకలు అంటించారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ పగ్గాలు రాహుల్‌కి ఇవ్వడం జరిగితే బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లే’నని అన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం తమ పార్టీకి శుభసూచకంగా ఆమె అభివర్ణించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేస్తోన్న ఈ మార్పు బీజేపీకి బలాన్ని చేకూర్చనుందని, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కి ఉపయోగపడనుందని ఎద్దేవా చేశారు. మరో కేంద్ర మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ని మునిగిపోతోన్న పడవగా అభివర్ణించారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే మోదీ దేశ ప్రజలకిచ్చిన కాంగ్రెస్ ఫ్రీ ఇండియా దిశగా దేశం పయనిస్తుందని అన్నారు.