: గొరిల్లాలు పిల్లలను చంపవు... సాక్ష్యమిదే... 20 ఏళ్ల నాటి ఘటన వీడియో మీరూ చూడండి
ఓ చిన్నారిని కాపాడేందుకు సిన్సినాటీ జూ అధికారులు 17 సంవత్సరాల గొరిల్లా హరాంబేను కాల్చి చంపిన నాటి నుంచి జూ అధికారులు, చిన్నారి తల్లిదండ్రుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, గొరిల్లాలు పిల్లలను చంపవని, ప్రేమగా కాపాడతాయని చెప్పే యదార్థ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 20 సంవత్సరాల క్రితం, 1996లో ఇల్లినాయిస్ లోని జూలో ఉన్న గొరిల్లా ఎన్ క్లోజర్ లో ఎనిమిదేళ్ల బాలుడు పడిపోయిన వేళ, ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకెళ్లి, తన ఒళ్లో పడుకోబెట్టుకుని, ఆపై జూ సిబ్బంది దాని వద్దకు వెళితే, వారి ముందు వదిలేసి పక్కకు పోయింది. ఈ ఘటనకు చెందిన వీడియోను ఇప్పుడు చూస్తున్న నెటిజన్లు, హరాంబేకు కూడా బిడ్డపై దాడి చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేనట్టు కనిపిస్తోందని, కేవలం జంతు మనసుతో మాత్రమే అది బిడ్డను లాక్కెళ్లగా, రెండు ప్రాణాలనూ కాపాడే ప్రయత్నం ఎంతమాత్రమూ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1996 ఆగస్టు 19న జరిగిన ఘటనపై 'షికాగో ట్రిబ్యూన్'కు వివరణ ఇచ్చిన ఇల్లినాయిస్ జూ ప్రతినిధి సాండ్రా కాట్జెన్, "తన ఎన్ క్లోజర్ లో పడ్డ బాలుడి వద్దకు వచ్చిన గొరిల్లా తొలుత చుట్టూ తిరిగింది. చేతుల్లోకి తీసుకుంది. ఓ బండపైకి వెళ్లి కూర్చుంది. జూ సిబ్బంది సంయమనంతో వ్యవహరించారు. ఆ బాలుడి చెయ్యి విరిగింది. శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి" అని తెలిపారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి గొరిల్లాలపై పరిశోధనలు సాగిస్తున్న ఇయాన్ రెడ్మాండ్ స్పందిస్తూ, "జూ సిబ్బంది మరో ఆప్షన్ పరిశీలించి వుండాల్సింది. గొరిల్లా దృష్టిని మరల్చడం, మత్తు మందివ్వడం వంటివి చేసి వుండొచ్చు. కాల్చి చంపడమన్నది ఆఖరి ప్రయత్నంగా చేయాల్సింది. హరాంబే ఉదంతం వీడియోను చూస్తుంటే, బాలుడికి హాని కలిగిస్తుందని అనిపించలేదు. జాగ్రత్తగానే బాలుడిని లేపి నిలిపింది. వాడు ధరించిన దుస్తులను పరిశీలించి చూసింది" అన్నారు. ఆ సమయంలో జూ సిబ్బంది చాలా కఠిన పరిస్థితి ఎదుట ఉండి వుంటారని అభిప్రాయపడ్డారు.