: సెల్ ఫోనంత బరువుతో పుట్టిన ఆడపిల్ల... ప్రాణం నిలిపిన నల్గొండ ప్రభుత్వ వైద్యులు


తెలంగాణ వైద్య చరిత్రలో ఓ అద్భుతాన్ని చేసి చూపారు నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యలు. కేవలం ఓ సెల్ ఫోన్ అంత బరువుతో (650 గ్రాములు) పుట్టిన చిన్నారి ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. సాధారణంగా పిల్లలు పుట్టినపుడు సరాసరిన రెండున్నర కిలోల బరువుంటారు. కానీ, తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లాలో ఓ తల్లి నెలలు నిండకముందే, అంటే ఆరో నెలలోనే ప్రసవించింది. పుట్టిన బిడ్డ ప్రాణాలతోనే ఉంది. కానీ బతుకుతుందన్న ఆశలు ఎంతమాత్రమూ లేవు. బిడ్డను బతికించుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు తల్లిదండ్రులు. "సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలు 1.2 కిలోలకన్నా తక్కువ బరువుంటే నేను చేర్చుకోను. కానీ, బిడ్డ తల్లిదండ్రులు చాలా పేదవారు. పైగా ఆడపిల్ల. దీంతో అడ్మిట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. బిడ్డ తల్లిదండ్రులు పాపను అనాధగా వదిలేసి వెళ్లిపోయారు. నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి వారిని రప్పించాల్సి వచ్చింది" అని ప్రస్తుతం రిషిత (వైద్యులు పెట్టుకున్న పేరు)తో ఆడుకుంటూ, డాక్టర్ దామర యాదయ్య గర్వంగా చెబుతున్నారు. ఆసుపత్రిలో ఎప్పుడూ 24 నుంచి 26 మంది బిడ్డలు ఉంటూనే ఉంటారని, వారి కోసం నలుగురు నర్సులు మాత్రమే ఉండగా, ఓ నర్సును నిత్యమూ రిషిత వద్దే ఉంచేవాడినని, ఇప్పుడు పాప పుట్టి ఐదు నెలలు గడిచాయని, ఆమె ఎదుగుదల సాధారణంగా ఉందని, వినికిడి శక్తి, చూపు బాగున్నాయని, ఎవరైనా పలకరిస్తే, నవ్వుతుందని, మరింత ఆనందంగా నవ్వుతూ తెలిపారు. రిషిత తల్లిదండ్రులు, నానమ్మ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. వైద్యులు, నర్సులు నిజమైన తల్లిదండ్రుల్లా తమ బిడ్డను పోషించి అద్భుతం చేశారని, లేకుంటే అరకిలో బరువుతో పుట్టిన బిడ్డ బతికేది కాదని అంటున్నారు. "ఎంతో గొప్పవాళ్లైన ఐన్ స్టీన్, పికాసో, అంబేద్కర్ వంటి వారెందరో నెలలు నిండకుండానే పుట్టారని డాక్టర్ నాకు చెప్పారు. నా బిడ్డ కూడా అంత గొప్పదవుతుందన్న నమ్మకం నాకుంది" అని రిషిత తల్లి మమత సంబరంగా చెబుతోంది. రిషితను కంటికిరెప్పలా కాపాడి ప్రాణాలు నిలిపిన నల్గొండ ప్రభుత్వాసుపత్రి బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News