: పొట్టి డ్రస్సుతో వచ్చిందని డ్యాన్సర్ ను విమానం ఎక్కనివ్వని జెట్ బ్లూ... అండగా నిలిచిన నెటిజన్లు!
ప్రముఖ డ్యాన్సర్ మెక్ మఫ్ఫీన్, పొట్టి దుస్తులతో వచ్చిందని ఆరోపిస్తూ, జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించని ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ కాగా, పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. అమెరికాలోని మెసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆమె అప్పటికప్పుడు తన దుస్తులను మార్చుకుని వచ్చిన తరువాతే విమానంలో కాలుమోపేందుకు అనుమతించిన అధికారుల తీరు వివక్షా పూరితమని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. బ్యూటీ సాలిడారిటీ, బ్యూటీ షార్ట్ సపోర్ట్ పేరిట హాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలిచారు. విమర్శల వేడి పెరగడంతో మఫ్ఫీన్ కు విమానయాన సంస్థ క్షమాపణ చెబుతూ 162 డాలర్ల క్రెడిట్ ఆఫర్ ఇచ్చింది. కాగా, విమానం ఎక్కాలంటే ఎలాంటి డ్రస్ కోడ్ ఉండాలన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది.