: ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎన్నెన్నో ప్రత్యేకతలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభించారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఆయన వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేడుకల సందర్భంగా నేడు హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా లెక్కలేనన్ని ప్రత్యేకతలు కనిపించనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాదులోని సంజీవయ్య పార్కులో ఓ భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ కానుంది. దాదాపు 30 రోజుల పాటు దేశ, విదేశాలకు చెందిన నిపుణులు కష్టించి రూపొందించిన ఈ పతాకం... దేశంలోనే అత్యంత ఎత్తైనదే కాకుండా అత్యంత పొడవైన పతాకంగా రికార్డులకెక్కనుంది. ఇక ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని నేడు నగరంలోని అన్ని పార్కుల్లోకి ప్రవేశాలను ఉచితంగా అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాష్ట్రంలోని 12 వేల ఆలయాల్లో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేసేందుకు రంగం సిద్ధమైంది.