: ‘జంపింగ్’లలో పోతుల ప్రత్యేకం!... చేరికకు ముందే ఎదురెళ్లి స్వాగతించిన టీడీపీ శ్రేణులు!


ఏపీలో కొనసాగుతున్న టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’లో ఇప్పటిదాకా జరిగిన తంతుకు పూర్తి భిన్నంగా నిన్న ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ పై గెలిచిన భూమా నాగిరెడ్డితో మొదలైన చేరికలు అన్నింటిలో నిరసన గళాలు వినిపించాయి. అప్పటిదాకా పార్టీకి అండగా తాము నిలిస్తే... తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ ఆయా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇన్ చార్జీలు పార్టీని నిలదీశారు. ఎలాగోలా ఆ నిరసన గళాలను చల్లార్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేరికలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకుంటూ పోతున్నారు. అయితే ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు విషయంలో మాత్రం నిరసన గళం వినిపించలేదు. నేడు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతున్న ఆయనకు చేరికకు ముందే అరుదైన స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు నిన్న పోతుల ఇంటి వద్దకెళ్లి మరీ సాదర స్వాగతం పలికారు. ఇక నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీగా ఉన్న దివి శివరాం నిన్న విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో కొత్తగా చేరుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. వెరసి ‘జంపింగ్’లలో పోతుల ప్రత్యేకంగా నిలిచారు.

  • Loading...

More Telugu News