: తెలంగాణ ఆవిర్భావానికి రెండేళ్లు!... మరికాసేపట్లో అట్టహాసంగా వేడుకలు!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మరికాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో టీఆర్ఎస్ నేతలతో పాటు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం పాల్గొననుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్న వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. నగరంలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించే కార్యక్రమంతో మొదలయ్యే వేడుకలు ఆ తర్వాత సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ కు చేరతాయి. పోలీసు కవాతుతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డుల ప్రదానం, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటాయి. ఆ తర్వాత సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ మువ్వన్నెల జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పలు రంగాలకు చెందిన ప్రముఖులతో కేసీఆర్ భేటీ అవుతారు.