: సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన భారత జాతీయ పతాకం ప్రత్యేకతలు ఇవే...!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆగమేఘాల మీద ప్రణాళికలు రచించిన అధికారులు, నగరం నడిబొడ్డున ఉండేలా సంజీవయ్య పార్కును దానికి వేదికగా ఎంపిక చేశారు. అనంతరం సాయిల్ టెస్టు చేసిన నిపుణులు దానిని ఖరారు చేయడంతో పెద్ద జెండా టవర్, జెండా తయారీకి టెండర్లు పిలిచారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. వారు 46 టన్నుల ఇనుము ఉపయోగించి, 300 అడుగుల టవర్ ను పలు భాగాలుగా తయారు చేసి, కోల్ కతా నుంచి హైదరాబాదు తరలించారు. కేవలం 25 రోజుల్లో తయారు చేసిన ఈ టవర్ ను పైకి లేపేందుకు ముంబై నుంచి ప్రత్యేకమైన క్రేన్లను రప్పించారు. అనంతరం ఏవియేషన్ అనుమతులు నిరాకరించడంతో వారి సూచనల మేరకు టవర్ ను 9 అడుగులు తగ్గించారు. దీంతో ఈ టవర్ 291 అడుగుల ఎత్తున నిలవనుంది. దీని పై భాగంలో నాలుగు సింహాల రాజముద్రను ఏర్పాటు చేశారు. దీనిపైన భారత జాతీయ పతాకం సగర్వంగా ఎగురనుంది. దీని వెడల్పు 72 అడుగులు కాగా, పొడవు 102 అడుగులు.