: ఎంత భూమి అవసరమో అంతే తీసుకుంటున్నాం: ఏపీ ముఖ్యమంత్రి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత భూమి అవసరమో అంతే తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని అన్నారు. భూములిచ్చిన రైతులను మనస్ఫూర్తిగా అభినందించాలని వ్యాఖ్యానించారు. తీసుకున్న భూమికి వారు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములను సేకరించామని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.24వేల కోట్లు రైతు రుణ విముక్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతు రుణ విముక్తి చేశామని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను విడతల వారీగా రుణ విముక్తులను చేయగలుగుతున్నామని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.