: వాషింగ్ మెషిన్ లో తలపెట్టాడు, ఆపై నరకయాతన పడ్డాడు!
ఎవరి పని వారే చేసుకోవాలి అనే సిద్ధాంతానికి కాస్తంత గట్టిగా కట్టుబడ్డాడో ఏమో... ఓ చైనా యువకుడు, వాషింగ్ మెషిన్ రిపేరు చేసుకునే క్రమంలో డ్రయ్యర్ లో తల పెట్టి, అందులో ఇరుక్కుని నరకయాతన పడ్డాడు. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ కథనం ప్రకారం, ఫుజియాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి, తన వాషింగ్ మెషిన్ ఎంతకీ పనిచేయకపోవడంతో దాని డ్రయ్యర్ లో తల పెట్టి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా, ఒక్కసారిగా తల ఇరుక్కుపోయింది. తనతో పాటు ఉంటున్న రూం మేట్స్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ తల బయటకు రాకపోవడంతో, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది 40 నిమిషాలు శ్రమించి, ఆ వ్యక్తిని కాపాడారు. చిన్నపాటి గాయాలతో బయటపడిన అతనిప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పీపుల్స్ డైలీ వెల్లడించింది.