: గోమాంసమే... అయితే ఏంటి? ... సోషల్ మీడియాలో ప్రశ్నలు
గోమాంసం తిన్నాడన్న కారణంతో హత్యకు గురైన మహ్మద్ అఖ్లాక్ వివాదం కొత్త మలుపు.. అంటూ మీడియాలో ప్రసారమవుతున్న వార్తల పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అమలులో ఉన్న గోసంరక్షణ చట్టం ప్రకారం గోవును చంపడం మాత్రం నేరం. గోమాంసం తినడం నేరం కాదు. ఇకపోతే అఖ్లాక్ హత్య సందర్భంగా అతని నివాసంలో దొరికిన మాంసాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం మధురలోని ఫోరెన్సిక్ విభాగానికి పంపడం అది గోమాంసం కాదు, మటన్ అని చెప్పడం జరిగాయి. అయితే అఖ్లాక్ ఇంటి సమీపంలోని చెత్తకుప్పలో దొరికిన మాంసం శాంపిళ్లను ఫోరెన్సిక్ నివేదికకు పంపగా అది ఆవు లేదా లేగ దూడ మాంసంగా నిర్ధారణ అయింది. అయితే అతని నివాసం సమీపంలో దొరికిన మాంసాన్ని అఖ్లాక్ కుటుంబం వేసినదేనని అనలేమని పోలీసులు తెలిపారు. దాద్రిలో మతఘర్షణలు సర్వసాధారణమని, హిందువుల నివాసాల ముందు గోమాంసం పడేయడం, మసీదుల మందు పంది మాంసం పడేయడం సర్వసాధారణమని స్ధానికులు చెబుతున్నారు. అదే సమయంలో గోమాంసం కలిగి ఉండడం నేరం కాదనేది యూపీ చట్టం చెబుతోంది. గోహత్య నేరం తప్ప, మాసం తినడం హత్యచేసినట్టు కాదని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అది గోమాంసం అయినప్పటికీ... మనిషిని చంపడం నేరం కాదా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా అఖ్లాక్ నివాసంలో దొరికినది మటన్ అని తేల్చిన తరువాత మరోసారి నివేదిక విడుదల చేయడం వెనుక కారణం యూపీలో జరగనున్న ఎన్నికలు అని తెలుస్తోంది. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగోట్టడం ద్వారా లబ్ధి పొందే స్కెచ్ గా పరిశీలకులు దీనిని భావిస్తున్నారు.