: ‘టాటూ’లతో ఉద్యోగ సమస్యలు!


టాటూలు వేయించుకునేవారు ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లినప్పుడు ఇలాంటి వారిని రీ మెడికల్ టెస్ట్ కు పంపుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)కు ఎంపికైన అభ్యర్థులకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. సుమారు 15 వేల మంది అభ్యర్థులు ఎంపికైతే అందులో రీ మెడికల్ కు వచ్చిన వారు సుమారు 8 వేల మంది వరకు ఉన్నారట. అందులో మూడు వేల మంది టాటూలు వేయించుకున్నవారే కావడం గమనార్హం. దీంతో తమ శరీరంపై వేయించుకున్న టాటూలను తొలగించుకునేందుకని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఆయా నగరాలకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, టాటూలకు, ఉద్యోగాలకు ఏమిటా లింకు? మెడికల్ గా ఎందుకు రిజక్ట్ చేస్తున్నారంటే... శరీరంపై టాటూలు ఉండటం వల్ల వైద్యపరీక్షలు చేసేటప్పుడు వారికి ఉన్న వ్యాధులు తెలియవని, అందుకని రీమెడికల్ కు పంపుతారు. ఆ టాటూలను తొలగించుకునేటప్పుడు చేసే పరీక్షల్లో ఏవైనా సమస్యలు ఉంటే తెలిసిపోతాయి. టాటూలు వేసుకునే వారిలో మానసిక ప్రవర్తన సరిగా ఉండదని స్టాఫ్ సెలక్షన్ కమిటీలోని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పైగా, స్వలింగ సంపర్కులు ఎక్కువశాతం మంది టాటూలు వేసుకుంటారని, దాని వల్ల విధుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయని, దీంతో టాటూలు వేసుకున్న అభ్యర్థులను రీ మెడికల్ కు పంపుతారని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనల నేపథ్యంలో టాటూలు వేయించుకునేవారు తమ భవిష్యత్, ఉద్యోగం మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

  • Loading...

More Telugu News