: అభివృద్ధి చేసిన అనుభవముండగా... డిగ్రీలెందుకు?: మోదీ డిగ్రీలపై దేశ యువత భావనిదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలేంటని ప్రశ్నించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పెద్ద చర్చకే తెర తీశారు. మోదీ డిగ్రీలన్నీ నకిలీవేనని కూడా ఆప్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఆరోపణలు నిజమో, మోదీ చెబుతున్నది నిజమో తెలియదు కాని... అసలు ఈ వివాదంపై దేశ యువత ఏమనుకుంటున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ వినూత్న యత్నం చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిది వివిధ వర్గాలకు చెందిన యువత వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఉన్న మోదీకి డిగ్రీలెందుకంటూ యువత ముక్తకంఠంతో చెప్పింది. ఇప్పటికే గుజరాత్ ను అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మోదీకి... ఎలాంటి డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదని పాఠశాల స్థాయి అమ్మాయిలు కూడా ఏమాత్రం తత్తరపాటు లేకుండా చెప్పేశారు. ‘‘విద్యార్థి దశలో ఉండగా మోదీ ఏం చదివారన్న విషయం మాకవసరం లేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకం మాకుంది. ఇక డిగ్రీలతో పనేముంది?’’ అంటూ యువత పలు ఆసక్తికర అభిప్రాయాలను వెల్లడించారు.