: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 1000 థియేటర్లు... చిన్న సినిమాలకు ఇక మంచి రోజులు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వదేశ్ గ్రూప్ సంస్థ కొత్తగా 1000 థియేటర్లను నిర్మించనుంది. ఇందుకోసం 10వేల కోట్ల రూపాయలను ఆ సంస్థ ఖర్చుచేయనున్నట్లు సమాచారం. స్వదేశ్ గ్రూప్ సంస్థ నిన్న చేసిన ఈ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. థియేటర్లు దొరక్క చిన్న సినిమాలు తీసే నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోన్న సంగతి తెలిసిందే. స్వదేశీ గ్రూప్ ప్రాజెక్ట్ డెరైక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద సినిమాల ధాటికి పండుగ సీజన్లలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేవని, ఈ పరిస్థితి నుంచి వారిని బయట పడేసేందుకు తమ షాపింగ్ మాల్స్‌లో థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాఘవేంద్రరావు, దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తెలుగు సినీ పెద్దలతో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఓ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పుణె ఫిలిమ్ ఇన్‌స్టి ట్యూట్ తరహాలో ఇది ఉంటుందని ఆయన పేర్కొన్నారు.