: కేసులు 13... ఆస్తులు రూ.17 కోట్లు!: అఫిడవిట్ లో వివరాలు చెప్పిన విజయసాయి


వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయసాయిరెడ్డి... తన ఆస్తులతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను కూడా వెల్లడించక తప్పలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థిగా ఆయన ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. తాజాగా నిన్న తన సతీమణి సునందారెడ్డితో ఓ డమ్మీ నామినేషన్ కూడా వేయించారు. ఈ క్రమంలో నామినేషన్ తో పాటు తన ఆస్తులు, తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడిస్తూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ అందజేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని ఆయన ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక తనకు, తన భార్య, కుటుంబ సభ్యులకు మొత్తం రూ.17.21 కోట్ల మేర ఆస్తులున్నాయని కూడా ఆయన ఆ అఫిడవిట్ లో ప్రస్తావించారు. తాను, తన భార్య వ్యక్తిగతంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని కూడా విజయసాయి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News