: కొట్టుకున్న విశాఖ ఖాకీలు!... ఎస్ఐ తలకు గాయం, కానిస్టేబుల్ అరెస్ట్!
నిజమేనండోయ్... శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే విచక్షణ మరిచి ప్రవర్తించారు. అసాంఘిక శక్తులను అణచివేయాల్సిన బాధ్యతలను మరిచి అందరూ చూస్తుండగానే కలబడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. ఈ ఘర్షణలో తన పై స్థాయి అధికారిగా ఉన్న సబ్ ఇన్ స్పెక్టర్ పై కానిస్టేబుల్ దే పైచేయిగా నిలిచింది. కానిస్టేబుల్ దాడిలో ఎస్ఐ తలకు తీవ్ర గాయమైంది. ఇక కాస్తంత ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఇతర పోలీసులు వారిద్దరినీ విడదీసి ఎస్ఐకి గాయం చేసిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. ఇదంతా ఏపీలోని సాగర నగరం విశాఖలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన. ఏఆర్ (ఆర్మ్ డ్ రిజర్వ్ డ్) విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న భగవాన్, అదే విభాగానికి చెందిన కానిస్టేబుల్ అమ్మోరుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే జరిగిన ఈ ఘర్షణలో గాయాలపాలైన భగవాన్ ఆసుపత్రికి చేరగా, ఎస్ఐని కొట్టిన అమ్మోరు అరెస్టయ్యాడు.