: ప్రకాశం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడి పోస్టు ఖాళీ!... నేడు సైకిలెక్కనున్న గిద్దలూరు ఎమ్మెల్యే!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు భారీ షాక్ తగలనుంది. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి నేడు వైసీపీకి వీడ్కోలు చెప్పి టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అశోక్ రెడ్డి నేడు భారీ అనుచరగణంతో విజయవాడ బయలుదేరనున్నారు. నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు అశోక్ రెడ్డి చేరికకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు సమాచారం చేరవేశారు. అశోక్ రెడ్డి చేరికకు జిల్లాకు చెందిన పార్టీ నేతలు తరలిరావాలని ఆయన జనార్దన్ కు సూచించారు. అశోక్ రెడ్డి వైసీపీని వీడితే... ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 49కి పడిపోవడంతో పాటు అధ్యక్షులు లేని పార్టీ జిల్లా శాఖల సంఖ్య మూడుకు చేరనుంది. ఇప్పటికే బుడ్డా రాజశేఖరరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడుల ఝలక్ తో కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి అధ్యక్షులు లేకుండా పోయారు. జ్యోతుల నెహ్రూ ఇచ్చిన షాక్ తో తూర్పు గోదావరి జిల్లాలోనూ ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఆ పదవిలో కన్నబాబు నియమితులయ్యారు.