: యుద్ధమంటూ జరిగితే పాకిస్థాన్ ఉండదుగా!... ఏక్యూ ఖాన్ వ్యాఖ్యలకు అజిత్ దోవల్ కౌంటర్!
పాకిస్థాన్ తలచుకుంటే భారత రాజధాని ఢిల్లీ ఐదంటే ఐదు నిమిషాల్లో బూడిద అయిపోతుందంటూ పాక్ అణు పితామహుడిగా పేరున్న ఏక్యూ ఖాన్ (అబ్దుల్ ఖాదిర్ ఖాన్) చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఢిల్లీపై పాక్ మిస్సైళ్లు పడేలోగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాదు, కీలక నగరాలు కరాచీ, లాహోర్ తదితరాలు నామరూపాల్లేకుండా పోతాయని భారత రక్షణ రంగ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భాతర అణ్వస్త్ర సామర్థ్యాన్ని పాక్ తక్కువగా అంచనా వేస్తోందని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్... ఏక్యూ ఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అసలు యుద్ధమంటూ జరిగితే, ఆ తర్వాత పాకిస్థాన్ కనిపించబోదని దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధమైనా, మరే ఇతర తరహా యుద్ధమైనా జరిగిందంటే... ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల భారత్ కూ నష్టం తప్పకపోవచ్చన్న ఆయన, ఆ నష్టం చాలా తక్కువేనని చెప్పారు. అయితే పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి మాత్రం భారత్ కు లేదన్నారు. పాకిస్థాన్ పరిస్థితి అలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ వద్ద ఉన్న అణ్వస్త్ర సంపత్తితో ఒక్కసారిగా దాడి చేస్తే పాకిస్థాన్ నామరూపాలు కూడా కనిపించవని ఆయన హెచ్చరించారు.