: నేనేమీ ఎంజాయ్ చెయ్యడానికి ఫామ్ హౌస్ కు వెళ్లడం లేదు: కేసీఆర్
తానేమీ ఎంజాయ్ చేయడానికో లేదా లగ్జరీ కోసమో ఫామ్ హౌస్ కు వెళ్లడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా, ఏ మాత్రం విరామం దొరికినా గజ్వేల్ సమీపంలోని ఎరవెల్లి ఫామ్ హౌస్ కు ఎందుకు వెళతారన్న ప్రశ్న ఎదురైంది. అక్కడ తన ఇల్లు ఉందని, వ్యవసాయం కూడా చేయిస్తున్నానని, అదేమీ ఫామ్ హౌస్ కాదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గం కూడా అదేనని, అక్కడికి వెళితే, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉన్నట్లవుతుందని అన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ పనులు కూడా చూస్తుంటానని తెలిపారు. తన కుటుంబంతో గడిపే సమయం తక్కువేనని, గత మూడు దశాబ్దాలుగా ఇంట్లో వాళ్లు అలవాటు పడిపోయారని చెబుతూ, ఏ రాజకీయ నేత కూడా తన కుటుంబానికి న్యాయం చేయలేడని కేసీఆర్ వ్యాఖ్యానించారు.