: రేపటి నుంచి గూగుల్, ఫేస్ బుక్ ఇండియాలో పన్ను కట్టాల్సిందే!
ఇండియాలో డిజిటల్ సేవలందించే ఇంటర్నేషనల్ సంస్థలను సైతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు కొత్త మార్గాన్ని ఎన్నుకోవడంతో రేపటి నుంచి గూగుల్, ఫేస్ బుక్ వంటి ఎన్నో ఇంటర్నేషనల్ టెక్ కంపెనీలు ఇండియాలో పన్నులను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో 'గూగుల్ టాక్స్' పేరిట సమానత్వ పన్నును ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో డిజిటల్ సేవలను అందించి పొందుతున్న పేమెంట్స్ పై ఐటీ శాఖకు పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఆన్ లైన్ వ్యాపార ప్రకటనలు, అడ్వర్టయిజింగ్ స్పేస్ కల్పించడం వంటి ప్రభుత్వం నిర్దేశించిన సేవలన్నింటిపైనా ఈ పన్ను భారం పడుతుంది. విదేశాల్లోని కంపెనీలు భారత్ లో అభివృద్ధి చెంది, నిర్దేశిత డిజిటల్ సేవలను అందిస్తుంటే వాటిపై పన్ను పడుతుంది. దీన్నుంచీ ఓఈసీడీ (ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్) ఆధారిత ప్రాఫిట్ షేరింగ్ ప్రాజెక్టులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ ఆలోచనతో ఇండియాలో భారీ ఎత్తున ఆదాయం పొందుతున్న ఇంటర్నెట్ దిగ్గజాలపైనే అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) మరియు పరిశ్రమల ప్రతినిధుల కమిటీ అందించిన సిఫార్సుల మేరకు ఈ పన్ను విధానానికి రూపకల్పన జరుగగా, రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది.