: ఫుట్ బాల్ ఆటగాడిని కొట్టిన హీరో సూర్య... కేసు నమోదు!


తనపై చెయ్యి చేసుకున్నాడని ఓ ఫుట్ బాల్ ఆటగాడు కేసు పెట్టడంతో దక్షిణాది హీరో సూర్యపై చెన్నై, శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, టీ నగర్లో బ్యూటీ సెలూన్ నడుపుతున్న లెనిన్ ఇమ్మానుయేల్, తన ఫ్రెండ్, సీఎఫ్ఏ (చెన్నై ఫుట్ బాల్ అసోసియేషన్) ఆటగాడు ప్రేమ్ కుమార్ తో కలిసి ఫుట్ బాల్ ఆట కోసం అడయార్ ప్రాంతం మీదుగా వెళుతున్న వేళ, తిరువికా వంతెనపై ఓ కారు వేగంగా వచ్చి సడన్ బ్రేకు వేయడంతో వీరి బైకు అదుపుతప్పి ఆ కారును ఢీకొంది. దీంతో వారి బైక్ బాగా దెబ్బతింది. దాంతో, కారును నడుపుతున్న మహిళతో నష్టపరిహారం కోసం వీరిద్దరూ మాట్లాడుతున్న వేళ, అడయార్ లోని తన ఇంటికి వెళుతున్న హీరో సూర్య అదే రూట్లో వచ్చాడు. వచ్చీ రావడంతోనే, 'ఓ మహిళను వేధిస్తారా?' అంటూ, ప్రేమ్ కుమార్ పై చెయ్యి చేసుకున్నాడు. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో, ఆమెతో గొడవకు దిగవద్దని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని లెనిన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కాగా, ఓ మహిళతో బాధ్యతగా ప్రవర్తించాలని యువకులకు సూచించాడే తప్ప, సూర్య ఎలాంటి తప్పూ చేయలేదని ఆయన సెక్రటరీ తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News