: గ్రేట్ స్టేట్... డైనమిక్ స్టేట్!: ఏపీపై సురేశ్ ప్రభు ప్రశంసల జల్లు
రెండేళ్ల క్రితం శివసేన నుంచి బయటకువచ్చి మోదీ ప్రోత్సాహంతో బీజేపీలో చేరిన మహారాష్ట్ర నేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేషన్ వేశారు. తన కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న సురేశ్ ను ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలా? అన్న మీమాంసలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్జన భర్జన పడుతుండగా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమ పార్టీకి దక్కనున్న మూడు సీట్లలో ఓ సీటునిస్తామని, అభ్యర్థిని సూచించాలంటూ ప్రతిపాదించారు. దీంతో వెనువెంటనే స్పందించిన బీజేపీ... సురేశ్ ప్రభుకు ఆ అవకాశం కల్పించాలని సూచించింది. ఇందుకు చంద్రబాబు సరేననడంతో నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకు రాజ్యసభ సభ్యత్వమిచ్చిన ఏపీపై సురేశ్ ప్రభు ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని గ్రేట్ స్టేట్ గానే కాకుండా డైనమిక్ స్టేట్ గా అభివర్ణించారు. ఏపీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, భారత్ కూడా అంతే అభివృద్దితో పరుగులు పెడుతుందన్నారు. దేశంలో కీలక రాష్ట్రంగా ఏపీ ఎదుగుతుందని, అందుకనుగుణంగా ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిస్తామన్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు ఆయన చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.