: భువనేశ్వర్‌లో అమానుషం.. మృతదేహాన్ని బైక్ కు కట్టి తీసుకెళ్లిన వైనం
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణ ఘటన కనిపించింది. పోస్ట్ మార్టం అనంతరం ప్లాస్టిక్ కవర్ ప్యాక్ చేసి తమకు అప్పగించిన ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెనకాల కట్టుకుని తీసుకెళ్లారు. కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు స్థానికంగా అలజడి సృష్టిస్తున్నాయి. చనిపోయిన వ్యక్తుల భౌతిక కాయాల్ని జాగ్రత్తగా, సంప్రదాయానుసారంగా ఒక చోటి నుంచి మరోచోటుకి తరలించడం భారతీయ ఆచారం. కానీ ఈ వ్యక్తులు బైక్ పై మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడం పట్ల ఆ దృశ్యాలు చూసిన వ్యక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని భారాముండా గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని తరలించేందుకు దగ్గరలో వాహనాలు ఉన్నా కూడా సదరు వ్యక్తులు ఇలా ప్రవర్తించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కొన్ని రోజుల ముందు అదే ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు కూడా ఇటువంటి సంఘటనే కనపడింది.