: సినిమా సీన్ తరహాలో కారు చోరీ.. సుప్రీంకోర్టు న్యాయవాది కారుని దొంగిలించిన వైనం
సినిమాలలో కనిపించే సీన్ తరహాలో ఢిల్లీలో కొందరు దొంగలు ఓ కారుని చోరీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించి దొంగలు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కారుని దొంగిలించారు. మిత్రులతో కలిసి అక్కడి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి సదరు న్యాయవాది బయట పార్కు చేసిన కారు వద్దకు వస్తోన్న సమయంలో ఆయన కారు చోరీకి గురైంది. అడ్రస్ తెలియడం లేదనే వంకతో ఓ దొంగ తనకు కొంచం సాయం చేయండని కారులో ఉన్న డ్రైవర్‌ని అడిగాడు. కారు డ్రైవర్ ఆ వ్యక్తితో మాట్లాడుతుండగా మరో ముగ్గురు వ్యక్తులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తమ దగ్గరున్న తుపాకీని తీసి డ్రైవర్‌ని బెదిరించారు. డ్రైవర్ సహా దొంగలు కారులో కూర్చొని కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక కారు డ్రైవర్‌ని వదిలేశారు. కారు చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.