: సోనియా అల్లుడి కోసం లండన్ లో మ్యాన్షన్ కొన్న ఆయుధ వ్యాపారి... కొత్త ఆరోపణలపై విచారణ ప్రారంభించిన మోదీ సర్కారు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఓ ఆయుధ వ్యాపారి ఆయన కోసం లండన్ లో మ్యాన్షన్ కొనుగోలు చేశాడని తాజాగా వచ్చిన ఆరోపణలపై కేంద్రం విచారణను ప్రారంభించింది. 2009లో ఆ వ్యాపారి భవంతిని కొనుగోలు చేశాడని తెలుస్తుండగా, రాబర్ట్ వాద్రా తరఫు న్యాయవాదులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. "రాబర్ట్ వాద్రాను ఓ పద్ధతి ప్రకారం ఇరికించాలని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి" అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. కాగా, రాబర్ట్ వాద్రా, అతని అసిస్టెంట్ మనోజ్ అరోరా ఈ-మెయిల్ ఖాతాల నుంచి వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఈ-మెయిల్ కు వెళ్లిన సమాచారం ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు రెండు నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా కొత్త విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. గత నెలలో సంజయ్ భండారీకి చెందిన 18 ప్రాంతాల్లోని ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీలు దాడులు జరుపగా, వాద్రాకు సంబంధించిన మ్యాన్షన్ వివరాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మ్యాన్షన్ లో మరమ్మతులు తదితరాలపై రాబర్ట్ వాద్రా సమాచారాన్ని కోరుతూ, సలహా, సూచనలు ఇస్తున్న ఈ-మెయిల్ 2010 ఏప్రిల్ 4న భండారీకి వెళ్లిందని నివేదికలో ఉంది. లండన్ లోని భండారీ బంధువు సుమిత్ చద్ధాకు వెళ్లిన ఈ-మెయిల్ లో "నా కార్యదర్శి మీకు అందుబాటులో ఉంటారు" అని ఉందని, ఆపై మనోజ్ ఎక్సిమ్ రియల్ ఎస్టేట్ పేరిట ఈ-మెయిల్ ఐడీ తెరచి సుమిత్ తో మాట్లాడుతూ ఉన్నారని పేర్కొంది.