: డీజిల్ వాహనాల సమాచారాన్ని చెబుతారా? అరెస్టవుతారా?: రాష్ట్రాలను కఠినంగా హెచ్చరించిన హరిత న్యాయస్థానం


డీజిల్ వాహనాలపై నియంత్రణను మరింతగా పెంచడం వల్ల పరిశ్రమకు, వినియోగదారులకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను కోరింది. "నేటి తరం వాహనాలు పదేళ్ల కన్నా ఎక్కువ జీవితాన్ని కలిగివున్నాయి. ఈ తరహా నిషేధాన్ని విధిస్తే, వాహనాల యజమానుల ఆర్థిక పరిస్థితి విషమిస్తుంది" అని భారీ పరిశ్రమల శాఖ విజ్ఞప్తి చేయగా న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. గత సంవత్సరం ఏప్రిల్ లో ఢిల్లీలో పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించిన తరువాత, హైదరాబాద్ సహా పలు నగరాల్లోనూ ఇదే విధమైన నిషేధం దిశగా గ్రీన్ ట్రైబ్యునల్ అడుగులు వేస్తున్న దశలో కేంద్రం కల్పించుకుంది. భవిష్యత్తులో కాలుష్యాన్ని తగ్గించాలంటే, ఇప్పటి నుంచే చర్యలు తప్పవని భావిస్తున్న న్యాయస్థానం "ట్రైబ్యునల్ ముందు జోకులు వేయవద్దు" అని హెచ్చరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రహదారులపై తిరుగుతున్న వాహనాలు, వాటి వయసును తెలియజేయాలని లేకుంటే చీఫ్ సెక్రటరీల అరెస్టుకు వారెంట్లను జారీ చేయాల్సి వుంటుందని పేర్కొంది. సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) నివేదిక ప్రకారం, యూపీలోని అలహాబాద్ కాలుష్యంలో మొదటి స్థానంలో ఉండగా, కాన్పూర్, వారణాసి, అమృతసర్, లూథియానా, పాట్నా, నాగపూర్, చెన్నై, అమృతసర్, పుణె, హైదరాబాద్ లలో డీజిల్ వాహనాల కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో ఈ నగరాలన్నింటిలో 2000 సీసీ కన్నా అధిక ఇంజన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాల నూతన రిజిస్ట్రేషన్లు ఆపాలని, పదేళ్లు దాటిన వాహనాలను తిరగనీయవద్దని ట్రైబ్యునల్ ఆదేశించగా, కేంద్రం రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News