: గొరిల్లా 'హరాంబే' చేసిన పాపమేంటి?... ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమర్శల వెల్లువ
నాలుగేళ్ల బాలుడిని రక్షించడానికి సిన్సినాటీ జూలో 17 సంవత్సరాల హరాంబే పేరున్న గొరిల్లాను చంపడంపై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనల వెల్లువ రోజురోజుకూ పెరుగుతోంది. హరాంబేకు మద్దతుగా ఆన్ లైన్లో ప్రారంభమైన పిటిషన్లపై, జూ అధికారులు, బాలుడి తల్లిదండ్రుల తీరును తప్పుబడుతూ 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. హరాంబే మరణానికి బాలుడి తల్లిదండ్రులను బాధ్యులుగా చేసి వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 'హరాంబేకు న్యాయం' అన్న పేరిట పిటిషన్ ప్రారంభం కాగా, బాలుడికి హాని కలిగించే ఉద్దేశం హరాంబేకు ఉన్నట్టు కనిపించలేదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. తన ఎన్ క్లోజర్ లోకి వచ్చిన బాలుడిని హరాంబే కావాలని గాయపరచలేదని వీడియో చూసిన వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఓ తల్లిదండ్రుల నిర్లక్ష్యం, జంతువు ప్రాణాలు తీసేలా చేసిందని తిట్టి పోస్తున్నారు. కాగా, ఆ బాలుడు, తాను గొరిల్లా దగ్గరకు పోతానని తన తల్లితో అంటుండటం విన్నట్టు ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు సందర్శకులు తెలిపారు. గొరిల్లాను చూస్తూ, 4.5 మీటర్ల లోతునకు బాలుడు పడిపోగా, అది చూసిన గొరిల్లా బాలుడి కాలు పట్టుకుని నీళ్లలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఆపై లేపి నిలబెట్టింది. సందర్శకులు పెద్దగా కేకలు పెడుతుంటే, మరోసారి లాక్కెళ్లి ఓ బండరాయిపై కూర్చుంది. మత్తుమందిస్తే, దాని ప్రభావంతో గొరిల్లా మత్తులోకి వెళ్లేలోపు జరగరానిది జరగవచ్చన్న ఆలోచనతో జూ సిబ్బంది హరాంబేను కాల్చి చంపి బాలుడిని రక్షించిన సంగతి తెలిసిందే. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. గొరిల్లా బాలుడిని తీసుకు వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్.