: కర్నూలు జిల్లాలో హైటెన్షన్!... సిద్ధేశ్వరం అలుగుకు రైతుల బారులు, అరెస్ట్ చేస్తున్న పోలీసులు


కర్నూలు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రాయలసీమ సాగు నీటి అవసరాలకు వరప్రదాయనిగా నిలవనుందని భావిస్తున్న సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేయాలని జల సాధన సమితి నిర్ణయించింది. అయితే అలుగును ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఓ వైపు రాజోలిబండ డైవర్షన్ స్కీం ఎత్తు పెంపు, మరోవైపు సిద్ధేశ్వరానికి అడ్డంకులతో రాయలసీమకు చుక్క నీరు కూడా అందదన్న భావనతో రైతులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిన్న రాత్రి నుంచే పలు ప్రాంతాల నుంచి సిద్ధేశ్వరం అలుగుకు బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది రైతులను పోలీసులు ఆయా ప్రాంతాల్లోని స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యగా సిద్ధేశ్వరం అలుగు సమీపంలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలను విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే తమకు న్యాయంగా దక్కాల్సిన నీటి కోసం వెళితే అరెస్ట్ చేయడం పోలీసులకు తగదంటూ జలసాధన సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News