: నాలుగో స్థానానికి పోటీపై ‘జంపింగ్’ల నిర్ణయమే ఫైనల్!...కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ!
ఏపీ కోటా రాజ్యసభ ఎన్నికల్లో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న గంటల తరబడి చర్చలు జరిపిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రెండు సీట్లకు తన పార్టీ నేతలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లను ఎంపిక చేశారు. మరో సీటును బీజేపీకి కేటాయించిన ఆయన ఆ స్థానానికి సురేశ్ ప్రభు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక వైసీపీకి దక్కనున్న నాలుగో సీటుకు పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై తర్జనభర్జనలు చేసిన చంద్రబాబు... ఆ నిర్ణయాన్ని ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు అప్పగించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) నాలుగో స్థానానికి పోటీ చేస్తానని చంద్రబాబు ముందు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యుల ఓట్లతో సంబంధం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలతో తనకున్న పరిచయాలతోనే తాను ఆ సీటును గెలుచుకుంటానని వీపీఆర్ చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు దాదాపుగా గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ పోటీలో వీపీఆర్ ను పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా బరిలోకి దింపాలన్న దిశగా టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. అంతేకాకుండా ఒకవేళ వీపీఆర్ బరిలోకి దిగితే... ఆయనను గెలిపించుకునే బాధ్యతను వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపైనే పెడితే ఫలితం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడకు పిలిపించిన ‘జంపింగ్’ ఎమ్మెల్యేలతో సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు... నాలుగో స్థానానికి వీపీఆర్ పోటీ నిర్ణయం వారిదేనంటూ తేల్చేశారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో విజయవాడలో ప్రత్యేకంగా భేటీ కానున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు నాలుగో స్థానానికి పోటీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వీరి భేటీపై అటు వీపీఆర్ తో పాటు వైసీపీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.