: టీడీపీతో బీజేపీ తెగదెంపులేనా?... నెమ్మదిగా దూరమవుతున్న మోదీ!
చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తును బీజేపీ తెంచుకోనుందా? స్వయంగా బీజేపీయే తెలుగుదేశానికి దూరంగా జరుగుతోందా? ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు, నిర్మాలా సీతారామన్ లను ఇక్కడి నుంచి కాకుండా, రాజస్థాన్, కర్ణాటక రాష్టాల నుంచి పంపాలని భావించడం భవిష్యత్తుకు వ్యూహమేనని అంటున్నారు. ఒకవేళ, ఇక్కడి నుంచి ఎవరికైనా చాన్స్ లభిస్తే, వేరే రాష్ట్రం నుంచి ఒకరిని ఏపీ తరఫున ఎంపిక చేయాలన్న ఆలోచన కూడా బీజేపీ గేమ్ ప్లానేనని భావిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిర్మలా సీతారామన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ దఫా కూడా ఆమెకు ఇక్కడి నుంచే చాన్స్ లభిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించుకోవడం వెనుక ఆంతర్యమేమన్న చర్చ మొదలైంది. ఇక రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న వెంకయ్యనాయుడు గతంలో కర్ణాటక నుంచి ఎంపిక కాగా, ఈ దఫా ఏపీ నుంచి చాన్స్ లభించవచ్చన్న అంచనాలూ పటాపంచలయ్యాయి. కన్నడనాట వెంకయ్యకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం, ఆయన స్థానంలో నిర్మలకు చాన్స్ ఇచ్చిందని అనుకున్నప్పటికీ, ఏపీని వదిలి రాజస్థాన్ ను ఎంచుకోవడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. ఇక చివరిగా, మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ వస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది బీజేపీ ఆచితూచి వేస్తున్న అడుగుగా తెలుస్తోంది. భవిష్యత్తులో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలకు గురి కాకుండా ఉండేందుకే బీజేపీ ఈ ప్లాన్ వేసినట్టు సమాచారం. పొత్తును తెంచుకోవాలంటే, సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నదే మోదీ మనసులోని మాటని, అందుకు అనుగుణంగానే రాజకీయాలు మారి, ఇక్కడి నేతలను పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ గెలిపించుకుంటోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీజేపీ, టీడీపీ పొత్తు ఎంతకాలం సాగుతుందో కాలమే నిర్ణయించాలి.